ఒకప్పుడు క్రేజీకాల్.నెట్ తదితర వెబ్‌సైట్ల ద్వారా ‘వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్’ విధానంలో కాల్స్ చేసేవారు. స్నేహితులను సరదాగా ఆట పట్టించేందుకు యువత ఎక్కువగా దీన్ని వినియోగించేవారు. అవతలి వైపు వ్యక్తులకు ఏ నంబర్(వర్చువల్) కనిపించాలి.. ఏ దేశం నుంచి చేస్తున్నట్లు అనిపించాలో ముందే సెట్ చేసుకోవాలి. ఇందుకోసం నిమిషాల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సదరు వెబ్‌సైట్ నిర్వాహకులు ఆయా ప్రాంతాల్లోని సర్వీస్ ప్రొవైడర్లతో ఒప్పందం చేసుకుని.. ఈ కాల్‌ను ఫార్వార్డ్ చేస్తారు. అంటే ముందుగా కాల్ మొదటి వ్యక్తి నుంచి వెబ్‌సైట్ నిర్వాహకులకు.. అక్కడి నుంచి సర్వీస్ ప్రొవైడర్‌కు.. ఆ తర్వాత చేరాల్సిన వ్యక్తికి చేరుతుందన్న మాట.
ఇప్పుడేమో యాప్‌లు...
ఇప్పుడు వెబ్‌సైట్ల స్థానంలో యాప్‌లు వచ్చేశాయి. ఇవి ‘వాయిస్ టెక్నాలజీ’ ఆధారంగా పనిచేస్తుంటాయి. ఇలాంటివి 36 వరకు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇవి కేటుగాళ్లకు ఆయుధంగా మారాయి. ఈ వర్చువల్ నంబర్‌తో సహోద్యోగిని వేధించిన వనస్థలిపురానికి చెందిన గ్రాఫిక్ డిజైనర్ టి.వినయ్(25)ను రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
ఎన్‌ఆర్‌ఐల పైనే గురి...
కొందరు కి‘లేడీ’లు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తున్నారు. పెళ్లి కోసం ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే సంప్రదించాలని ప్రొఫైల్‌లో పేర్కొంటున్నారు. విదేశాల్లో ఉన్నట్లుగా నమ్మించేందుకు వర్చువల్ నంబర్‌ను అందులో పేర్కొంటున్నారు. ఈ నంబర్(యాప్) ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటి తరహా కేసుల్ని ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. ముందుగా ఏ యాప్/వెబ్‌సైట్ నుంచి వచ్చిందో గుర్తించి.. సదరు నిర్వాహకులకు లేఖ రాస్తున్నారు. అక్కడి నుంచి సమాచారం వస్తేనే అడుగు ముందుకు పడుతుంది. లేదంటే కేసు దర్యాప్తు అక్కడితోనే ఆగిపోతుంది. వ్యాపారం దెబ్బ తింటుందనే ఉద్దేశంతో చాలా మంది నిర్వాహకులు సహకరించడం లేదని పోలీసులు వాపోతున్నారు.
నిరుద్యోగులను ఇలా...
ఈ వర్చువల్ నంబర్లను ఎక్కువగా ఉద్యోగాల పేరిట బురిడీ కొట్టించేందుకు వినియోగిస్తున్నారు. ప్రముఖ సంస్థలకు చెందిన అసలు నంబర్లు కనిపించేలా ఏర్పాట్లు చేసుకుని ఫోన్‌లోనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ నంబర్‌కు కాల్ చేస్తే నేరుగా సదరు సంస్థకు వెళ్తుంది. అప్పుడు మోసపోయినట్లు తెలుస్తుంది. బెంగళూరు కేంద్రంగా ఈ దందా నడుస్తోందని సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఇవీ చూడండి:
vehicle loan fraud: లగ్జరీ కార్ల పేర్లతో బడా స్కాం... లక్షల్లో బ్యాంకులకు ఎగనామం
CYBER CRIME: హైదరాబాద్ వైద్యుడికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.11 కోట్లు బదిలీ