Cyber cheating: మెడికల్ సీట్లు రాని వారే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని నుంచి రూ. పది లక్షలు కాజేశారు. బెంగళూరు కిమ్స్ వైద్య కళాశాలలో సీటిప్పిస్తానని టోకరా వేశారు. మోసపోయిన విషయం తెలుసుకున్న విద్యార్థిని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. గతనెల 4వ తేదీన నగరానికి చెందిన వెన్నెల అనే విద్యార్థిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వద్దకు వచ్చింది. తాను ఇంటర్మీడియట్ పూర్తి చేశానని... నీట్ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.
కొద్ది రోజుల క్రితం తన ఫోన్‌కు కెరీర్ 365 పేరుతో ఓ సందేశం వచ్చిందని తెలిపింది. అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేయగా.. బెంగళూరులోని ప్రఖ్యాత కెంపెగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( కిమ్స్)లో కేవలం రూ.10 లక్షలకే మెడికల్ సీట్ ఇప్పిస్తామంటూ చెప్పారని వివరించింది. వారి మాటలు నమ్మి అదనపు చార్జీలతో పాటు రూ.10.16 లక్షలు వారు తెలిపిన ఖాతాలో వేశామని తెలిపింది. అనంతరం ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయినట్లు పోలీసులకు తెలిపింది.
బాధితురాలి ఫిర్యాదుతో: బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నంబర్ ఆధారంగా బిహార్‌లో నిందితులు ఉంటారని సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఓ సైబర్ ముఠా ఇదంతా చేస్తున్నటు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రెండు ప్రత్యేక బృదాలతో నిందితుల కోసం గాలించారు. ఓ బృందం కెరీర్ 365 అనే పేరుతో వస్తున్న నంబర్లపై దృష్టి పెట్టింది. ఏడుగురు సభ్యుల ముఠా ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఈ ముఠా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నీట్ రాసిన విద్యార్దులు వివరాలు సేకరించి వారికి ప్రముఖ కాలేజీల్లో తక్కువ రేటుకు మెడికల్ సీట్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కోల్‌కతా, బెంగళూరు, పుణెలలో బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
బిహార్‌లోని సుపౌల్ జిల్లా బిర్పూర్కి చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని ఇక్కడ ఆధార్ కార్డులు సృష్టించుకున్నాడు. స్థానికంగా ఉన్న సైబర్ నేరాల ముఠాలతో చేతులు కలిపి నేరాలకు పాల్పడుతున్నాడు. నేరం చేసిన వెంటనే డబ్బును విత్ డ్రా చేసుకుని నేపాల్ పారిపోతున్నాడు. ఇక్కడ పోలీసులు నిఘా తగ్గాక తిరిగి మళ్లీ బిహార్ వచ్చి నేరాలు చేస్తున్నాడు. ఈ ముఠాపై హైదరబాద్‌లో రెండు, రాచకొండలో ఒక కేసు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న మరో ఆరుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. గజరావ్ భూపాల్, సీసీఎస్ జాయింట్ సీపీ
నేపాల్ టూ బిహార్: మరో బృందం బాధితురాలి చరవాణికి వచ్చిన ఫోన్ నంబర్‌పై దృష్టి పెట్టారు. ఫోన్ నంబర్ ద్వారా టవర్ లోకేషన్ బిహార్‌లోని సుపౌల్ జిల్లాకి వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో... పోలీసులు ఐఎంఈఐ నంబర్‌ను ట్రాక్ చేసి వారి చరవాణి లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేయగా బfహార్‌లోని నేపాల్ బోర్డర్ వద్ద ఆ నంబర్ ట్రాక్ అయినట్లు గుర్తించారు. చరవాణి నంబర్ ఆధారంగా నిందితుడిని అశోక్ షాగా గుర్తించారు. నిందితుడు నేపాల్ పారిపోయినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. బోర్డర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సన్‌సారి అనే గ్రామంలో తలదాచుకున్నట్లు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందింది. బోర్డర్లో ఉండే సహస్ర సీమాబల్(ఎస్ఎస్‌బీ)కి ఈ విషయాన్ని తెలియజేశారు. స్థానిక నేపాలి మహిళ సహాయంతో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించారు. ఓ ఇంట్లో ఉన్న అశోక్ షాను కారులో ఎక్కించి బోర్డర్ దాటి భారత్‌కు తీసుకొచ్చారు. బిహార్ కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టి నగరానికి తీసుకొచ్చారు. నేపాల్‌కి చెందిన అశోక్ షా పదో తరగతి వరకు మాత్రమే చదివాడు. కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బిహార్‌కి వలస వచ్చి నేరాలకు పాల్పడుతున్నారు. కౌన్సెలింగ్ లేకుండా తక్కువ ధరకు ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చూడండి: ACB raids at FRO: అటవీశాఖలో అవినీతి చేపలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అనిశా