cyber fraud : పెట్రోల్ బంకు ఏర్పాటుకు అనుమతులు ఇస్తామంటూ ఒక వ్యక్తిని మోసం చేసిన సంఘటన సైబరాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సైబర్ మోసగాళ్లు పెట్రోల్ బంకు ఏర్పాటుకు అనుమతి ఇస్తామంటూ ఓ వ్యక్తి నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. సైబరాబాద్ పరిధిలో ఓ వ్యాపారి పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆన్‌లైన్‌లో ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. వెంటనే వారిని సంప్రదించాడు.
ఫోన్ నంబర్ ద్వారా వారిని సంప్రదించిన వ్యక్తి ఈ-మెయిల్ ద్వారా భూమి పత్రాలు, వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. మరోవైపు మాటువేసి ఉన్న సైబర్ నేరగాళ్లు ఆ వ్యక్తి వివరాలు సేకరించి.. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఛార్జీల పేరుతో డబ్బులు చెల్లించాలని చెప్పారు. అది నమ్మిన వ్యక్తి వారికి రూ.77 లక్షలు చెల్లించాడు. సొమ్ము చెల్లించిన చాలా రోజుల వరకు అనుమతులు రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.