అవినీతి నిరోధక శాఖ (అనిశా-ఏసీబీ) డీఎస్పీ పేరుతో జగిత్యాల జిల్లాలోని పలువురు తహసీల్దార్లకు ఓ అగంతుకుడి నుంచి డబ్బు డిమాండ్ చేస్తూ బెదిరింపు ఫోన్లు వచ్చాయి. సదరు వ్యక్తి మొదట సంబంధిత మండల ఎస్.ఐ.లకు ఫోన్ చేసి.. వారి ద్వారా తహసీల్దార్ మొబైల్ నంబర్ సంపాదించాడు. మొదట ఎస్.ఐ.లతో తహసీల్దార్లకు ఫోన్ చేయించి తర్వాత తాను మాట్లాడటంతో నిజమని నమ్మిన తహసీల్దార్లు వణికిపోయారు. కొందరు భయంతో విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.. మరికొందరేమో సన్నిహితులతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే..
బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఓ మహిళా ఎస్.ఐ. మండల తహసీల్దారుకు ఫోన్ చేశారు. ఏసీబీ డీఎస్పీ మీ నంబర్ అడిగారు, ఆయన మీతో మాట్లాడవచ్చంటూ సమాచారమిచ్చారు. ఆ వెంటనే అగంతుకుడి నుంచి తహసీల్దారుకు ఫోన్ వచ్చింది. నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్నా.. నీ మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి.. అంటూ బెదిరించాడు. ట్రూ కాలర్‌లో మీరు చెప్పేదానికి బదులు మరోపేరు వచ్చిందేంటని తహసీల్దార్ అడగగా.. ఎక్కువ మాట్లాతున్నావంటూ గద్దించి ఫోన్ పెట్టేశాడు. అనంతరం అదే పంథాలో నియోజకవర్గంలోని మరో తహసీల్దారుతో మాట్లాడుతూ.. నీమీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఏమైనా మాట్లాడతావా.. జైలుకెళతావా అంటూ బెదిరించాడు. అంతేగాక జిల్లాలోని మరో ముగ్గురు తహసీల్దార్ల నంబర్లు అడిగాడు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చొప్పదండి నియోజకవర్గంలోని ఓ మహిళా తహసీల్దారుతో ఫోనులో మాట్లాడుతూ.. ‘నీ మీద అనేక ఫిర్యాదులున్నాయి. అరెస్టు చేస్తే 45 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఉద్యోగం ఊడుతుంద’ని బెదిరించాడు. గంటలోగా రూ.10 లక్షలు ఇవ్వాలి, లేకుంటే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించాడు.
భర్తతో మాట్లాడి చెబుతానని తహసీల్దార్ చెప్పగా.. తానే మాట్లాడతానంటూ నంబర్ తీసుకున్న అగంతుకుడు.. కరీంనగర్‌లో ఉన్న ఆమె భర్తకు ఫోన్ చేశాడు. వెంటనే రూ.10 లక్షలు ఇవ్వకుంటే నీ భార్యను కస్టడీకి తీసుకుంటానంటూ భయపెట్టాడు. తన వద్ద డబ్బు లేదని, తప్పదంటే భార్య బంగారం అమ్మి ఇస్తానని, కొంత సమయం కావాలని కోరగా.. సరేనన్నాడు. ఒకే పంథాలో ఓ అనామకుడు ఎస్.ఐ.లను, తహసీల్దార్లనూ డబ్బు కోసం ఇలా బెదిరించటం, వారు అతడిని అనుమానించకుండా చెప్పినట్లు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ విషయాన్ని జగిత్యాల డీఎస్పీ ఆర్.ప్రకాశ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. అగంతుకుడు బెంగళూరు నుంచి మాట్లాడినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకుంటామని అధికారులెవరూ భయాందోళనలకు లోనుకావద్దని సూచించారు.
ఇవీ చూడండి..