ఓ వైపు కొవిడ్ మహమ్మారి ప్రాణాలు హరించి వేస్తుంటే... మరోవైపు సైబర్ కేటుగాళ్లు గోతికాడ నక్కల్లా అవకాశాల కోసం కాచుకుని కూర్చుంటున్నారు. ప్రజల అవసరాలనే ఆసరాగా చేసుకుని లక్షలు కాజేస్తున్నారు. రోజుకోరకం మోసంతో సొమ్ము స్వాహా చేస్తున్నారు. ఇంతకాలం ఇంజక్షన్ల మోసాలు, ఆక్సిజన్ సిలిండర్ల పేరుతో దండుకోవడాలు, అంబులెన్సు రూపంలో నిలువుదోపిడీలు, చికిత్స పేరుతో ఊడ్చేయడాలు వంటివి ఎన్నో చూశాము. తాజాగా ఈ తరహా మోసాల్లోకి సైబర్ కేటుగాళ్లు ప్రవేశించారు. వ్యాక్సిన్ వేయిస్తామని ఫోన్ చేసి ఆన్లైన్లో నగదు బదిలీ చేయించుకుంటూ నయా మోసాలకు పాల్పడుతున్నారు.
వ్యాక్సిన్ పేరుతో..
కొవిడ్ టీకాల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రముఖ బట్టల దుకాణం యజమానికి ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు... తాము ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడుతున్నామని... మీ షాపులో పనిచేస్తున్న ఉద్యోగులకు వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. నిజమేనని నమ్మిన యజమాని 1.10లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టెస్టులు చేస్తామంటూ దోచేశారు...
మరో కేసులో కొవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తామంటూ హైదరాబాద్ పాత బస్తీకి చెందిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. ఇండియా మార్ట్‌లో ఫోన్నంబర్తో లాగిన్ అయిన బాధితుడి.. తన ఇంట్లో పదిమందికి టెస్టులు చేయాలని కోరాడు. అందుకోసం రిజిస్టర్ చేయాలని డెబిట్‌కార్డు వివరాలతో పాటు ఓటీపీ వివరాలు తీసుకున్నారు. అనంతరం అతడి ఖాతాలోంచి రూ. 2.94లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వ్యాక్సిన్ వేస్తామని.. ఆన్లైన్లో నగదు బదిలీ చేయండని వచ్చే ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటువంటి ఫోన్లు వస్తే తమకు ముందుగానే సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఇదీ చూడండి: భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత... ఇద్దరు అరెస్టు