ప్రస్తుతం పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్కు సంబంధించిన వివరాలతో పోలీసులు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలను తెరుస్తున్నారు. వీటి ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను సైబర్ నేరగాళ్లు అదునుగా తీసుకుంటూ ఆ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా దామెర పోలీస్ స్టేషన్కు సంబంధించి కొంత కాలం కిందట 'ఎస్హెచ్ఓ దామెర' పేరుతో ఫేస్బుక్ ఖాతాను పోలీసులు తెరిచారు. దాన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆదివారం రాత్రి పలువురు వ్యక్తులను డబ్బులు అడిగారు. గూగుల్ పే, ఫోన్ పే లాంటి వాటి ద్వారా పంపాలంటూ సందేశాలు పంపారు. వారు మోసగాళ్లని గ్రహించిన కొంతమంది ఆ విషయాన్ని దామెర పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసింది నిజమేనని... పోలీసులు తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకూడదన్నారు. పోలీసులు డబ్బులు అడగరని, ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
![Cyber criminals hacked the police Facebook account in warangal rural district,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11203672_ujkl12.jpg)
ఇదీ చదవండి: వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం