Cyber Cheating: పెళ్లికూతురు ముస్తాబు, వివాహ వేదిక నిర్వహణ అంటూ మాట్లాడిన సైబర్ నేరస్థులు.. వారిని మోసం చేసి ఒకరి వద్ద రూ.1.80 లక్షలు, మరొకరి వద్ద రూ.2.40 లక్షలు బదిలీ చేసుకున్నారు. మోసపోయిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరస్థులు కొత్తగా ఈ తరహా నేరాలు చేస్తున్నారని పోలీస్ అధికారులు తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.. అంకెలు పూరించండని అంటే మోసమేనని స్పష్టం చేశారు.
అంతర్జాల శోధన.. బాధితుల ఎంపిక..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కేంద్రంగా సైబర్ నేరస్థులు ఒకటి, రెండు నెలల నుంచి కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీలు, యూపీఐ నంబర్లు చెప్పండి అంటే కొందరు నమ్మడం లేదని గ్రహించారు. అందుకే మోసగించాలనుకుంటున్న వారిని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కువగా బిజీగా ఉండే మేకప్ స్టూడియోల నిర్వాహకులు, బ్యూటీషియన్లు, ఈవెంట్ మేనేజర్లపై వల విసురుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మేకప్ స్టూడియోలు, బ్యూటీషియన్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల ఫోన్ నంబర్లు తీసుకుంటున్నారు. అనంతరం తాము సైన్యంలో పనిచేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వంలో అధికారులుగా విధులు నిర్వహిస్తున్నామని, ప్రముఖ విద్యాసంస్థల్లో భాగస్వాములమని ఫోన్లు చేస్తున్నారు. ఫలానా తేదీల్లో.. ఫలానా వేదికలో పెళ్లి జరుగుతుందని చెబుతున్నారు. ఇలా రోజుకు పదిహేను నుంచి యాభై మందికి ఫోన్లు చేస్తున్నారు. స్పందించిన వారికి బయానాగా డబ్బు తీసుకోవాలంటూ మోసం చేసి రూ.లక్షలు బదిలీ చేసుకుంటున్నారు.
ముందు నేను.. తర్వాత మీరు..
బాధితుల నుంచి నగదు బదిలీ చేసుకునేందుకు సైబర్ నేరస్థులు ముందుగా వారే నగదు బదిలీ చేస్తున్నారు. తర్వాత మీరు నా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. బాధితులు పంపించగానే.. అప్పుడు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు.- తొలుత సైబర్ నేరస్థుడు రూ.100 బాధితుడి ఖాతా/వ్యాలెట్‌లోకి నగదు బదిలీ చేస్తున్నాడు. రూ.100 జమైందని చెప్పగానే.. మీరు రూ.200 పంపండి.. ఆ డబ్బు నా ఖాతాలో జమ కాగానే.. బయానాగా రూ.5 వేలు పంపుతామని చెబుతున్నాడు. - బాధితుడు రూ.200 పంపించి ఫోన్ చేయగానే.. సర్.. నా ఖాతాలో జమ కాలేదు. ఈసారి రూ.వెయ్యి పంపించండి.. మొత్తం రూ.6 వేలు బదిలీ చేస్తానని అభ్యర్థిస్తాడు.
రూ.1000 పంపించగానే... మీరు పంపిన డబ్బు రాలేదు.. ఒక్కసారి చూసుకోండి.. ఈ సారి రూ.5 వేలు పంపండి.. మొత్తం రూ.11 వేలు ఇచ్చేస్తానని గట్టిగా చెబుతాడు. - రూ.5 వేలు పంపించి బాధితుడు ఫోన్ చేయగానే... మీరు క్యూఆర్‌కోడ్‌లో సరిగా నంబర్ వేయలేదు.. ఈ సారి రూ.11 వేలు పంపిస్తే.. మీరు నాతో ఫోన్‌లో మాట్లాడుతుండగానే.. నగదు బదిలీ చేస్తానని ఇలా రూ.లక్షలు బదిలీ చేయించుకున్నాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. - సైబర్ నేరస్థుల చేతిలో మూడు రోజుల క్రితం మోసపోయిన బ్యూటీషియన్.. నిందితుడి మాటలు నమ్మి ఇరవై రెండు సార్లు నగదు బదిలీ చేసిందని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: