ఆగ్రో సీడ్ ఆయిల్ పేరుతో 11 కోట్ల రూపాయలు మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. ఔషధాల్లో కలిపే ఆయిల్‌ను విక్రయిస్తామంటూ మురళీ మోహన్‌రావు అనే వైద్యుడిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. హైదరాబాదుకు చెందిన డాక్టర్ మురళీమోహన్ రావుకి గీత నారాయణ్ అనే మహిళతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె అమెరికాలో తాము ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించింది.
అయితే వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని గీత నారాయణ్‌తో పాటు శ్రీలక్ష్మీ అనే మరో మహిళ , డాక్టర్ స్టీఫెన్ అనే వారు నమ్మించారు. వీరి వ్యాపారం నమ్మిన బాధితుడు వారు చెప్పిన విధంగా విడతల వారిగా అమెరికన్ డాలర్స్ రూపంలో 11 కోట్ల రూపాయలు ఆన్లైన్ ద్వారా బదిలీ చేశారు. అనంతరం వారు స్పందించక పోవడంతో.. ఆయిల్ కూడా సప్లయ్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు సైబర్ క్రైమ్ పోలీసులు.