The Kashmir Files: ఆధార్ కార్డు, బ్యాంకు కేవైసీ, మెసేజ్‌లు, ఆఫర్లు, డిస్కౌంట్లు.. ఇలా ప్రతి అంశాన్ని సైబర్ మాయగాళ్లు అనుకూలంగా మలచుకుని రూ.లక్షలు కాజేస్తున్నారు. చివరకు కరోనాను కూడా వాళ్లు ఓ అవకాశంగా మలుచుకున్నారు. కరోనా టీకా, కరోనా ఔషధాలు అంటూ అమాయకుల నుంచి డబ్బులు కొట్టేశారు. ఇలా ట్రెండ్‌లో ఉండే ప్రతి విషయం తమకో ఛాన్స్ అనుకుని అమాయక ప్రజలకు వల వేసి వాళ్ల కష్టార్జితాన్ని కొల్లగొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్ల దృష్టిలో 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాకు వస్తున్న హైప్ పడింది. ఇంకేంటి.. ఆ సినిమాను వాడుకుని వల పన్నాలనుకున్నారు.
Cyber Crimes in Telangana : ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ఉచితంగా చూడొచ్చంటూ లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఈ విషయంపై ప్రజలకు అవగానహన కల్పిస్తున్నారు రాచకొండ పోలీసులు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా లింక్ రూపంలో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దిల్లీ, నోయిడాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ను ఉచితంగా చూడొచ్చంటూ హ్యాకర్లు లింకులు పంపి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. మోసపోయినట్టు గుర్తించగానే సైబర్ క్రైమ్ సహాయ కేంద్రం 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.