కొవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్లు నయా మోసాలు చేస్తున్నారు. మెయిల్ హ్యాక్ చేసి నకిలీ ఈ-మెయిల్ ద్వారా రూ.23 లక్షలు కాజేశారు. హైదరాబాద్‌కు చెందిన వీరేంద్ర బండారి అనే వ్యాపారి పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ-మెయిల్ క్రియేట్ చేశారు. తాను కొవిడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. తనకు 23 లక్షల 60 వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా బదిలీ చేయాలని నకిలీ ఈమెయిల్ ఐడీ ద్వారా మోసగాళ్లు బ్యాంకుకు మెయిల్ చేశారు. తమ ప్రమేయం లేకుండానే నకిలీ లెటర్ ప్యాడ్‌పై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌కు మెయిల్ చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంతకం ట్యాలీ అవడంతో వారు చెప్పిన మూడు అకౌంట్లకు 23 లక్షల 60 వేల నగదును బ్యాంకు అధికారులు బదిలీ చేశారు. సాయంత్రం అకౌంట్ చెక్ చేసి డబ్బులు తక్కువ ఉండడంతో.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని గ్రహించిన వీరేంద్ర.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో ఇంతకుముందు సైబర్ నేరగాళ్లు మరో వ్యక్తిని మోసం చేశారని.. ఈ రెండు కేసులు దర్యాప్తు చేసి త్వరలోనే ఆ కేటుగాళ్లను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.