Cyber Frauds in Ananthapuram: సాంకేతికతను అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎదుటి వారి బలహీనతలను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము కాజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తూ.. ఖాతాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మోసపోయిన బాధితులు సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయడానికి పరుగులు తీస్తున్నారు. ఇటీవల నగరంలో దిలీప్ అనే వ్యక్తికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి తన ప్రమేయం లేకుండానే రూ.60వేలు తస్కరించారు.
తాడిపత్రికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్యకు చెందిన ఖాతా నుంచి రూ.30వేలు, జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఖాతా నుంచి రూ.లక్ష కాజేసినట్లు తెలిసింది. ఖాతాదారులు తమ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను కస్టమర్ కేర్‌కు తెలిపే క్రమంలో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. కస్టమర్ కేర్ నంబర్ల స్థానంలో సైబర్ దుండగుల ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. ఆ విషయం తెలియని వినియోగదారులు.. సదరు నేరగాళ్ల నెంబర్లకు ఫోన్ చేయడం వల్ల ఖాతాదారుల వివరాలు వారికి చేరుతున్నాయి. దీంతో ఖాతాదారుల ప్రమేయం లేకుండానే డబ్బు కాజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి.