Pudding Pub Case :పుడింగ్ పబ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితుల తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్న పోలీసుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. పబ్ లో పట్టుబడిన మాదక ద్రవ్యాల విషయంలో నిర్వాహకులదే బాధ్యత అని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది.
పుడింగ్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 3వ తేదీన తెల్లవారుజాము దాడి చేసి 4.6 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పబ్ నిర్వాహకుడు అభిషేక్‌తో పాటు మేనేజర్ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 4 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసు కస్టడీ ముగిసిన తర్వాత... నిందితుల తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కొకైన్ విషయంలో అభిషేక్, అనిల్‌లకు ఎలాంటి సంబంధం లేదని.... పబ్‌కు వచ్చిన వాళ్లలో ఎవరో తీసుకొని వచ్చారని ఆయన వాదించారు. బెయిల్ జారీ చేయాలని... పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించింది.
ఇవీ చదవండి : పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో వెలుగులోకి విస్తుపోయే విషయాలు