ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ను పైఅధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్... ఏటీ అగ్రహారంలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారని దిశా స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి... కానిస్టేబుల్ రమేశ్‌ను సస్పెండ్(Constable suspend) చేస్తూ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పి.రమేష్ 2019లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఆయన కుటుంబంతోపాటు ఓ ఇంట్లో పై అంతస్తులో అద్దెకు ఉంటున్నారు. కింద పోర్షన్‌లో ఓ స్కూలు మహిళా ప్రిన్సిపల్ కుటుంబం నివసిస్తోంది. పదో తరగతి చదువుతున్న ఆమె కుమార్తెతో కానిస్టేబుల్ కొద్ది రోజులుగా చనువుగా వ్యవహరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. తరచూ ఆమెతో మాట్లాడేందుకు యత్నిస్తుండటంతో... మాట్లాడవద్దని తాము బాలికను హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ఏం జరిగింది?
రెండు రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కానిస్టేబుల్ ఆ బాలికను పిలిపించి... అసభ్యంగా ప్రవర్తించినట్లు వాపోయారు. తొలుత దేహశుద్ధి చేసి... అనంతరం దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: ZERO FIR: 'అత్యాచారం చేసి నగ్న వీడియోలు తీసి.. బెదిరిస్తున్నాడు'