Conflict in Kurnool: ఏపీలోని కర్నూలు జిల్లా హోళగుందలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. శనివారం రాత్రి నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల ఊరేగింపు సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఊరేగింపు జరుగుతున్న క్రమంలో ఓ వర్గం వారు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 15 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఆలూరు సీఐతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మాత్రమే బందోబస్తులో ఉన్నట్లు తెలిసింది.
ఈ ఘటన జరిగిన వెంటనే సమీప ఠాణాల నుంచి వచ్చిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అక్కడికి వెళ్లి రాత్రి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం రెండు వర్గాలను సమావేశ పరచి సమస్యను పరిష్కరించాలని చూశారు. అదే సమయంలో ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఎదుటే మరోసారి రాళ్లు విసురుకున్నారు. దీంతో పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. ఎస్పీ సమక్షంలోనే రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: Nellore Theft Case: కోర్టు దొంగతనం కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్