మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడలోని వివాదాస్పద భూమి వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకన్న, కుందూరు శ్రీనివాస్ రెడ్డిల మధ్య 1.11 ఎకరాల భూమి విషయంలో గత కొంతకాలంగా తగాదా నడుస్తోంది. వీరిద్దరిని పోలీసులు బైండోవర్ చేశారు. ఈ క్రమంలో వెంకన్న కొంత మందితో కలిసి వివాదంలో ఉన్న భూమిలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నిస్తున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకొని కోర్టు కేసులో ఉన్న భూమిలోకి ట్రాక్టర్ ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ చోటు చేసుకుంది.
వెంకన్న వర్గానికి చెందిన వారు శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకన్న ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న వారిని చెదరగొట్టారు. ఇదే సమయంలో ఎస్ఐ చేతిలోని చరవాణిని లాక్కోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఐ తమను అకారణంగా కొట్టాడంటూ నలుగురు బాధితులు ఆరోపించారు.
భూమి విషయంలో పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వెంకన్న మరి కొందరితో కలిసి దంతాలపల్లి-బొడ్లడ రహదారిపై ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తొర్రూరు సీఐ కరుణ సాగర్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. వెంకన్నకు నచ్చ చెప్పి అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేయడం, కోర్టు కేసులో ఉన్న భూమిలోకి వెళ్లి నిబంధనలు అతిక్రమించినందుకు బాధ్యులైన 12 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకన్న పేర్కొన్నారు.