ఆధార్ ద్వారా బ్యాంకు సేవలను ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన అక్మల్ అలమ్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. కిషన్‌గంజ్ జిల్లా కొచ్చడమాన్‌కు చెందిన అక్మల్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన స్టేట్‌బ్యాంక్‌లో ఉన్న ఖాతాని ఏమార్చి పెద్దమొత్తంలో నగదు కొట్టేశాడు. ఈ మేరకు సీఐడీ అధికారులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఖాతాదారుల సౌలభ్యం కోసం చాలా బ్యాంకులు ‘ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ’ (ఏఈపీఎస్) పేరుతో ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. ఈ సేవలు పొందాలనుకునేవారు ముందుగానే బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరు, వేలిముద్రలను బ్యాంకుకు సమర్పించాలి. ఆ తర్వాత వారు లావాదేవీలు నిర్వహించాలనుకుంటే ఒక్కసారి వేలిముద్ర ఇస్తే చాలు.. ఆన్‌లైన్ ద్వారా నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, నగదు బదిలీ వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఖాతాదారులకు మరింత సులభతరమైన సేవలు అందించే ఉద్దేశంతోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అయితే అక్మల్ రిజిస్ట్రేషన్లశాఖలోని ధ్రువపత్రాలు, వాటి నుంచి వేలిముద్రలు సేకరించాడు. వాటి ఆధారంగా సిలికాన్ పదార్థం ఉపయోగించి నకిలీ వేలిముద్రలు తయారుచేశాడు. ఏఈపీఎస్ సేవలు పొందుతున్న ఖాతాదారుల వివరాలు కూడా సేకరించాడు. ఇప్పుడు చాలా బ్యాంకుల ఏటీఎంలు కేవలం వేలిముద్ర ద్వారానే నగదు ఉపసంహరణ సదుపాయాలు కల్పించాయి. పిన్ నంబర్ ఇవ్వాల్సిన పనిలేదు.
అక్మల్ చోరీ చేసిన వేలిముద్రలను ఉపయోగించుకొని ఇటువంటి ఏటీఎంల ద్వారా పెద్దమొత్తంలో నగదు ఉపసంహరించుకున్నాడు. సీఐడీలోని సైబర్ క్రైమ్స్ విభాగం అధికారులు ఈనెల 22న బిహార్‌లోనే అక్మల్‌ను అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై మంగళవారం హైదరాబాద్ తీసుకొచ్చి స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: