ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన చోరీ కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.40 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. చోరీ జరిగిన రోజు నుంచి రెండు రాష్ట్రాల పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఏపీలోని నందిగామ సమీపంలో జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నారు.
వైరాలోని ద్వారకానగర్‌లో రెండు రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులు మార్వాడి వ్యాపారస్తుని ఇంట్లో వృద్ధుడుపై దాడి చేసి రూ.35,61,650 లక్షల నగదు, బంగారం, వెండి వస్తువులు అపహరించారు. యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సీఐ వసంత్‌కుమార్, ఎస్సై సురేశ్‌లు దర్యాప్తు చేపట్టారు.
ఏపీ పోలీసుల సహకారం :
చోరీపై కృష్ణా జిల్లా నందిగామ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. రాజస్థాన్‌కు చెందిన దినేశ్ సింగ్, ఇన్సాఫ్ మహమ్మద్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద బ్యాగులో అధిక మొత్తంలో నగదు ,బంగారం ,వెండి ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఏపీ పోలీసులు సొత్తు దొరికిన విషయాన్ని వైరా పోలీసులకు తెలిపారు. కేసు వివరాలను నందిగామ డీఎస్పీ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను అభినందించారు.