కోడి పిల్లలను సరఫరా చేస్తోన్న వాహనంలో అగ్ని ప్రమాదం సంభవించి సుమారు రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.
హైదరాబాద్, శంషాబాద్‌లోని వరలక్ష్మి కోడి పిల్లల తయారీ కేంద్రానికి చెందిన డీసీఎం వాహనం.. కోడి పిల్లలను నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు పంపిణీ చేస్తూ ఉంటుంది. అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరులో.. కోడిపిల్లల సరఫరా పెట్టెలను దించేందుకు ఆపిన వాహనం డ్యాష్ బోర్డు నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
డ్రైవర్, క్లీనర్లు.. కోడి పిల్లలను కాపాడేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేక అవి మంటల్లోనే కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారంతో.. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పి వేశారు.
కోడి పిల్లల విలువ సమారు రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రక్తపుధార.. అద్దె అడిగినందుకు దారుణ హత్య