కార్లు కొనేందుకు బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి నకిలీ టీఆర్(తాత్కాలిక రిజిస్ట్రేషన్) నంబర్లు, ఛాసిస్ నంబర్లు ఇచ్చి. రూ.లక్షలు దండుకొని అజ్ఞాతంలోకి వెళ్లిన తల్వాల్ కార్స్ ప్రై.లిమిటెడ్ యజమాని సాకేత్ తల్వార్(41)ను సెంట్రల్ క్రైమ్ పోలీసులు(సీసీఎస్) సోమవారం అరెస్ట్ చేశారు. మూడేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు.
నగరంలో తల్వార్ కార్స్ పేరుతో వోల్వో, హ్యుందాయ్ కార్ల కంపెనీల డీలర్‌షిప్‌లను సాకేత్ తల్వార్ కొన్నేళ్ల క్రితం తీసుకున్నాడు. నాలుగు చోట్ల షోరూంలను ప్రారంభించాడు. కొత్త కార్లను వేగంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చి అంతే వేగంగా విక్రయించేవాడు. మూడేళ్ల క్రితం వాహనాల రుణం కోసం వచ్చిన వారితో కుమ్మక్కయ్యాడు. విక్రయించకుండానే నకిలీ పత్రాలు ఇస్తున్నాడు. బ్యాంకర్లు చెక్కులు ఇవ్వగానే తన వాటా తీసుకుంటున్నాడు. ఇతర నిందితులతో కలిసి రూ.1.90 కోట్లు ఇలా కొట్టేశాడు. రుణం వసూలు కాకపోవడంతో కెనరా బ్యాంక్, ఐడీబీఐ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సాకేత్‌పై పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్ పోలీస్ ఠాణాల్లోనూ ఆరు కేసులున్నాయి. నకిలీ టీఆర్ పత్రాలు ఇస్తున్నాడంటూ రవాణాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విల్లా అద్దె రూ.12 లక్షలు
తనపై ఫిర్యాదులందాయని తెలుసుకున్న సాకేత్ కుటుంబం సహా గోవాకు మకాం మార్చాడు. నెలకు రూ.12 లక్షలు చెల్లించి విల్లాలో ఉంటున్నాడు. రోజంతా విందులు, వినోదాలతో గడిపేవాడు. నగరంలో ఉండే తన దూరపు బంధువుకు ఇటీవల ఫోన్ చేశాడు. అతని ఫోన్‌పై నిఘాపెట్టిన పోలీసులు గోవా వెళ్లి నిందితుణ్ని అదుపులోకి తీసుకొన్నారు.
ఇదీ చూడండి: KRMB, GRMB: 'గెజిట్‌లోని అభ్యంతరాలపై కేంద్రాన్ని సంప్రదించండి'