Case on MP TG Venkatesh: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో విలువైన స్థలం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు విశ్వప్రసాద్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నంబరు 10లో ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్‌కు 2005లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మరో అర ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.
ఈ జాగా తమదేనంటూ కొందరు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు కొద్దిరోజుల కిందట డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ చేశారు. దీంతో ఆ స్థలాన్ని అధీనంలోకి తీసుకునేందుకు ఆదివారం ఉదయం దాదాపు పది వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడకు చేరుకుని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు.
విషయం తెలుసుకొన్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారిని గమనించి కొందరు వాహనాల్లో పరారయ్యారు. 63 మందిని అరెస్ట్ చేసి ఆయుధాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ భద్రత మధ్య కోర్టుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఎంపీ టీజీ వెంకటేశ్, టీజీ విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ తదితర 15 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
స్థలం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండవచ్చని అంటున్నారు. గతంలోనూ ఈ స్థలంపై పలు కేసులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. స్థలానికి చెందిన చీఫ్ సెక్యూరిటీ అధికారి నగేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టుబడిన వారిపై హత్యాయత్నం కేసుతో పాటు అక్రమప్రవేశం, సమూహంగా వచ్చి దాడి చేయడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి : సగం నెల గడిచినా అందని జీతాలు... 23 వేల మంది ఉద్యోగుల ఎదురుచూపులు