'ఏ కంప్యూటర్ వెనకాల... ఏ కంపు గాడు ఉన్నాడో తెలుసుకుని మసులుకోవాలి' అని ఓ సినిమాలో హీరో.. హీరోయిన్ను హెచ్చరిస్తాడు. అమ్మాయిలు ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలనే సన్నివేశంలో ఆ డైలాగ్ వస్తుంది. కానీ ప్రస్తుతం ఈ డైలాగ్‌ను అబ్బాయిలు కూడా అనుసరించాలి. ఫ్రెండ్ రిక్వస్ట్ వస్తే.. ఆత్రంగా మాటలు కలిపేయకుండా ఆలోచించాలి. యువతే టార్గెట్‌గా రెచ్చిపోతున్న నేరగాళ్లు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడి ఉన్నదంతా దోచేస్తున్నారు. చదువుకున్న వారు సైతం ముందు వెనకా ఆలోచించకుండా కక్కుర్తి పడి వారి వలలో చిక్కుకుపోతున్నారు. అవతల వాళ్ల కోరికలే పెట్టుబడిగా.. సైబర్ నేరగాళ్లు ముందుకు దూసుకుపోతున్నారు. డేటింగ్ యాప్ నుంచి ముద్దుగా మాటలు కలిపి... సర్వం దోచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 'కాల్ మీ ఎనీటైమ్ మెసేజ్'తో విశాఖలో భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్న ప్రవీణ్ అనే యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
ప్రణీత్ అనే యువకుడిని మభ్యపెట్టిన ముఠా... అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడేలా చేశారు. ప్రవీణ్ నగ్నంగా వీడియోకాల్ మాట్లాడుతున్నప్పుడు రికార్డు చేశారు. అనంతరం ముఠా బెదిరింపులకు దిగింది. పరువు పోతుందని భావించిన యువకుడు... పలుమార్లు రూ.24లక్షలు ముఠాకు ఇచ్చాడు. వేధింపులు తట్టుకోలేక యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠాకు చెందిన మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.5లక్షలు, ల్యాప్‌టాప్, 8 చరవాణులు స్వాధీనం చేసుకున్నట్టు క్రైమ్ డీసీపీ సురేశ్‌బాబు తెలిపారు.
కక్కుర్తి పడితే నష్టం తప్పదు
ఎంత కక్కుర్తి పడితే అంతే నష్టం వాటిల్లుతుందని యువత గ్రహించాలి. సోషల్ మీడియాలో వచ్చే రిక్వస్ట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. దారుణం ఏంటంటే... చదువుకున్న వారే ఎక్కువగా ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఎంత చదివి ఏం లాభం ఇలా ఆలోచించకుండా చేసే ఈ పనులతో సమాజంలో ఎలా తిరుగుతారు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం... మోసం చేసే వారు ఉంటారని గ్రహించాలి. ఆన్లైన్లో వచ్చే రిక్వస్ట్ల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా నగ్నంగా కాల్ మాట్లాడమని చెప్తే తిరస్కరించాలి. వేధింపులు ఎక్కువైతే కంప్లైంట్ ఇవ్వాలి.
ఇదీ చదవండి: 'కశ్మీర్లో భారీ దాడులకు పాక్ కుట్ర'