Bridegroom family members attacked on Lady: ప్రేయసి కోసం ప్రేమికుడు విలన్లతో దెబ్బలు తినే సన్నివేశాలు రీల్ లైఫ్‌లో కనబడితే.. ప్రేమించినవాడి కోసం ప్రియురాలి మౌనపోరాటాలు, ప్రియుడి కుటుంబీకులతో దెబ్బలు తినే సన్నివేశాలు రియల్ లైఫ్‌లోనే ఎక్కువగా ఉంటాయి. మనసిచ్చిన వాడిని నమ్మి సర్వస్వం అర్పించిన యువతికి.. పెళ్లి సమయం దగ్గరికొచ్చేసరికి ప్రేమికుడి నుంచి మొండి చేయే కనిపిస్తుంది. ఇదేంటని నిలదీసి అడిగితే.. అతడి కుటుంబీకుల నుంచి దౌర్జన్యమే తప్ప దిద్దుబాటు చర్యలు కనపడవు. సుపుత్రుడు చేసిన తప్పును సమర్థిస్తారు. కానీ ఆ తప్పు చేసిన వాడికి బలైన యువతికి మాత్రం జీవితాంతం మానసిక వేదనే బహుమతి. తమ ఎనిమిదేళ్ల బంధానికి అలాంటి బహుమతే ఇచ్చాడు ఓ ప్రేమికుడు.
ఎనిమిదేళ్ల ప్రేమ బంధం.. ఆ బంధంలో ఎన్నో మధురానుభూతులు, ఊసులు, ఒకరిపై ఒకరి బాసలు. ఆ పయనంలో ఎప్పటికైనా తనవాడేననుకున్న ఆ యువతి.. తన సర్వస్వాన్నే అర్పించింది. కానీ అవన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయని అనుకోలేదు. నమ్ముకున్న వాడే నట్టేట ముంచుతాడని కలలో కూడా ఊహించలేకపోయింది. ప్రేమించినవాడు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేకపోయిన బాధితురాలు.. ఎలాగైనా తన ప్రేమను దక్కించుకోవాలని చూసింది. చివరకు ఆమెకు తీరని అన్యాయమే జరిగింది.
ఓ ఆడదాని మనసు సాటి ఆడదానికే తెలుసంటారు. కానీ ఇక్కడ ఆ బాధితురాలికి మాత్రం చుట్టూ ఉన్న ఆడవాళ్లు సైతం శత్రువులుగా మారారు. ఆమె గోస విని నిజానిజాలు తెలుసుకుని.. సామరస్యంగా పరిష్కరించాల్సింది పోయి మానవత్వం మరిచి ప్రవర్తించారు. అక్కడున్న పోలీసుల మౌనం సైతం వారికి అరాచకానికి ఆజ్యం పోసినట్లైంది. దీంతో ఇంకా రెచ్చిపోయి జట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి చెప్పులతో కొట్టారు. తన బాధను కూడా చెప్పుకొనే అవకాశమివ్వలేదు. ఇదంతా చూస్తున్న మన కథానాయకుడు మాత్రం.. దీంతో తనకేం సంబంధం లేదన్నట్లుగా తన పనిలో తాను లీనమైపోయాడు.
ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహాన్ని మహబూబాద్ జిల్లా గార్లకు చెందిన బాధితురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించింది. గార్ల ప్రాంతానికి చెందిన శ్రీనాథ్ తనను ఎనిమిదేళ్లుగా ప్రేమించాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకున్నాడని వాపోయింది. పెళ్లి విషయం మాట్లాడిన ప్రతిసారీ దాటవేసి.. ఇప్పుడు ఖమ్మం వచ్చి రహస్యంగా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని యువతి ఆరోపించింది. తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్న యువతి.. కల్యాణ వేదిక లోపలికి వెళ్లి పెళ్లి ఆపబోతుండగా.. అక్కడున్న యువకుడి బంధువులు ఆమెను అడ్డుకున్నారు. అయినప్పటికీ వారిని ప్రతిఘటించి లోపలికి వెళ్లబోతుండగా.. ఆమెను అడ్డుకుని కిందపడేసి జుట్టు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. 'నీ కొడుకు నన్ను ప్రేమించి మోసం చేశాడు.. న్యాయం చేయండి' అని వేడుకుంటున్నా వినకుండా దాడికి దిగారు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న ఓ పోలీసు అధికారి మాత్రం కనీసం ఆమెపై దాడిని ఆపేందుకు యత్నించలేదు. యువకుడి బంధువులు సైతం పోలీసు ఉన్నారనే భయం లేకుండా ఆమెపై దాడి చేస్తూనే ఉన్నారు.
తన కళ్లముందే ఇదంతా జరుగుతున్నా.. పెళ్లి కుమారుడు మాత్రం బయటకు వచ్చి సంజాయిషీ చెప్పుకొనేందుకు యత్నించలేదు. కనీసం ఆమెపై దాడిని ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. పెళ్లి కూతురు కానీ, ఆమె తరఫు బంధువులు కానీ అసలేం జరుగుతుంది.. నిజానిజాలు తేలాకే పెళ్లి జరిపిద్దాం అనే ఆలోచనా చేయలేదు. తన కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేయడం కోసం.. మరో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదు. ఓ వైపు ప్రేమించినవాడి మౌనం.. మరో వైపు అతడి బంధువుల అరాచకత్వానికి మానసికంగా, శారీరకంగా కుంగిపోయిన యువతి.. తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని మీడియా ఎదుట కుమిలి కుమిలి ఏడ్చింది. పోలీసులు సైతం వాళ్లకే మద్దతుగా ఉన్నారని.. తన బాధను పట్టించుకోవడం లేదని వాపోయింది. వాళ్ల కళ్లముందే విచక్షణా రహితంగా కొడుతున్నా.. చూస్తూ ఊరుకున్నారని విలపించింది. ఇదంతా జరుగుతుందని వాళ్లకు ముందే తెలుసని.. అందుకే పోలీసులకు డబ్బులిచ్చి వాళ్ల వైపునకు తిప్పుకొన్నారని ఆరోపించింది.
ఎనిమిదేళ్ల తన ప్రేమబంధాన్ని దక్కించుకోవాలని ఆ యువతి ఎంతగా ఆరాటపడినా.. ఆ పోరాటం ఒకవైపే అయింది. నమ్మినవాడు చేసిన మోసంతో ఆ యువతి ఇప్పుడు మానసికంగా ఒంటరిది అయిపోయింది. ఓ వైపు తనపై దాడి జరుగుతున్నా.. మరోవైపు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్న ప్రేమికుడి నయవంచనను భరించలేకపోయిన యువతి.. కన్నీళ్లతోనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
ఇవీ చదవండి: కోలుకున్నా.. బిల్లు కట్టలేక.. ఆసుపత్రిలోనే ఆత్మహత్య
బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్ ధర ఒకేసారి రూ.84 పెంపు.. ఎక్కడంటే...