మూడు ముళ్లేసి నాలుగు రోజులు కూడా గడవకుండానే.. మృత్యువు కబళించింది. కొత్తగా పెళ్లి చేసుకున్న నవవధువరులు.. ఎంతో సంతోషంగా వధువు ఇంటికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాదకర ఘటనలో వరుడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. వధువు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడి ఇవాళ ప్రాణాలు విడిచింది. మూడు రోజుల కింద మంగళవాద్యాలతో మారుమోగిన ఆ ఇళ్లు.. ఈ గుండె పగిలిన వార్త విని రోదనలతో ప్రతిధ్వనించింది.
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులు.. చెన్నైకి చెందిన యువతితో ఈ నెల 21న తిరుపతిలో ఘనంగా వివాహం చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత.. ఎంతో సంతోషంగా వధువుతో కలిసి ఆమె సొంతూరైన చెన్నైకి కారులో బయలుదేరారు. బెంగళూరు సమీపంలో వాళ్ల కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి.. అక్కడికక్కడే మృతి చెందాడు. పెళ్లికూతురు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమీపంలోని ఆసుపత్రికి తరలించి కనిమొళికి చికిత్స అందిస్తుండగా ఇవాళ ఆమె కూడా మృతి చెందింది. నూతన వధూవరులు ఇద్దరు ఐదు రోజుల్లోపే చనిపోవడంతో ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి.
ఇదీ చూడండి: