ఆకాశమంత పందిరి .. భూదేవి అంత పీట వేసి.. ఊరంతా గొప్పగా చెప్పుకునేలా.. తన గారాలపట్టికి జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి చేయాలనుకున్నాడు ఆ తండ్రి. తన బిడ్డను తన కంటే ప్రేమగా.. కంటికి రెప్పలా చూసుకునే అల్లుడు దొరికాడని మురిసిపోయాడు. ఇక తన కూతురు గురించి.. ఆమె భవిష్యత్ గురించి ఎలాంటి చింత అవసరం లేదనుకున్నాడు. తన కంటిపాపకు నచ్చినట్లే వేడుక జరపాలని నిశ్చయించుకున్నాడు. కళ్లు మిరుమిట్లుగొలిపేలా తన బిడ్డ నిశ్చితార్థ వేడుకను అంగరంగ వైభవంగా చేశాడు. దానికి రెట్టింపు సంబురంతో పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేశాడు. తన బంగారుకొండ పెళ్లికి ఊరంతా పిలిచాడు.. ఎక్కడెక్కడి నుంచో బంధువులను ఆహ్వానించాడు. అందరి సమక్షంలో.. తన అల్లుడి చేతిలో కూతుర్ని పెట్టాలనుకున్నాడు. ఇంకాసేపట్లో తన కూతురు తన నుంచి శాశ్వతంగా ఇంకో ఇంటికి వెళ్లిపోతుందన్న బాధలో ఉన్న ఆ తండ్రికి.. పెళ్లి జరుగుతుండగా తన కుమార్తె అకస్మాత్తుగా కుప్పకూలడం షాక్ కలిగించింది. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకుని తన కన్నబిడ్డను పరుగున ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పెళ్లి పనుల్లో పడి సరిగ్గా తినకపోవడం వల్ల స్పృహ తప్పిందేమోనని తనని తను తమాయించుకుని.. తన కంటిపాపకు ఏం కాదని భార్యకు ధైర్యం చెప్పాడు. ఆమెకు ధైర్యం చెప్పాడు కానీ.. తన బిడ్డకు ఏం అవుతుందోనని అనుక్షణం గుండెల్లో ఆయనకు వణుకు పుడుతూనే ఉంది. ఇంతలోనే డాక్టర్ వచ్చి చెప్పిన విషయం విని ఆ తండ్రి కాళ్ల కింద భూమి కంపించింది. పెళ్లి చేసి అత్తారింటికి పంపుదామనుకున్న తన కూతుర్ని కాటికి పంపాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆ కన్నపేగు గుండెలవిసేలా రోదించింది.
ఈ విషాద ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పెళ్లిపీటలపై వధువు స్పృహ కోల్పోయింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెళ్లికుమార్తె కుప్పకూలింది. వధువు సృజనను బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వధువు మృతిచెందింది.
బుధవారం రాత్రి 7 గంటలకు సృజన వివాహం జరగాల్సి ఉంది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అనంతరం పెళ్లి జరుగుతుండగా పెళ్లికుమార్తె కుప్పకూలింది. సృజన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తమ గారాలపట్టికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దామని ఆకాశమంత సంబురంలో ఉన్న ఆ తల్లిదండ్రుల కళ్లముందే కూతురు కుప్పకూలంతో గుండెలవిసేలా రోదించారు. తనతో ఏడడుగులు వేసి ఏడు జన్మలు తోడుటుందనుకున్న అమ్మాయి.. తన చేతిలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ పెళ్లికుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పెళ్లికుమార్తె మృతితో ఇటు వధువు, అటు వరుడు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.