ఏపీలోని అనకాపల్లి జిల్లాలోని మాడుగుల ఘాట్ రోడ్‌కు చెందిన 28 సంవత్సరాల యువకుడు అద్దేపల్లి రామునాయుడుకు, రావికమతం గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతికి నిశ్చితార్థమైంది. వచ్చే నెలలో పెళ్లి కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై షాపింగ్‌కు వెళ్లారు. కొమళ్లపూడిలో షాపింగ్ అనంతరం.. పక్కనే ఉన్న బాబా ఆశ్రమం వద్దకు వెళ్లారు. అక్కడ కళ్ల గంతలు ఆడుదామని వధువు చెప్పడంతో.. రామునాయుడు సరే అన్నాడు. అతని కళ్లకు గంతలు కట్టిన యువతి.. ఆ తర్వాత కత్తితో అతని గొంతు కోసింది.
అనంతరం.. ద్విచక్రవాహనంపై సమీపంలోని రావికమతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి, గొంతుకు ఏదో గుచ్చుకుని గాయమైందని అక్కడి వైద్య సిబ్బందికి చెప్పి, అక్కడి నుంచి పరారైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, ప్రాథమిక చికిత్స అనంతరం యువకుడిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని, సదరు యువతి కోసం గాలింపు చేపట్టారు. బాధిత యువకుడు హైదరాబాద్‌లో పీహెచ్డీ చేస్తున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: