తల్లితో పాటు గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా కంటైనర్ లారీ ఢీ కొట్టడంతో నాలుగేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చౌరస్తా సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడకల గ్రామానికి చెందిన సోనీ అనే మహిళ గుడ్ ఫ్రైడే సందర్భంగా తన కుమారుడు శాంతికుమార్(4)తో కలిసి స్థానికంగా ఉన్న చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఇస్నాపూర్ చౌరస్తా సమీపంలోని రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వెళుతోన్న కంటైనర్ లారీ పెట్రోల్ ట్యాంకర్ను తప్పించే క్రమంలో బాలున్ని ఢీ కొట్టి రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పటాన్చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆత్మహత్యాయత్నం చేసిన సునీల్ నాయక్ మృతి