చెరువులో కాసేపు సరదాగా గడపడానికి వెళ్లారు ఓ నలుగురు స్నేహితులు. అందులో ముగ్గురు ఒడ్డునే నిలవగా.. మరో బాలుడు ఓ అడుగు ముందుకేశాడు. లోతు ఎక్కువుందని గ్రహించేలోపే నీట మునిగి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాదకర ఘటన సికింద్రాబాద్, జవహర్ నగర్ పీఎస్ పరిధిలో జరిగింది.
మల్కారం ప్రాంతానికి చెందిన ఉదయ్ కిరణ్.. స్నేహితులతో కలిసి సాయంత్రం సమయంలో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీట మునిగాడు. తోటివారి సమాచారంతో.. కుటుంబసభ్యులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
గాలింపు చేపట్టి.. బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రాష్ట్రంలో నిత్యం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉండగా.. నదులు, చెరువులు, కుంటల వద్ద హెచ్చరికల బోర్డులను పెట్టాల్సిన అవసరముందంటున్నారు స్థానికులు.
ఇదీ చదవండి: ఉద్యోగం రాలేదని మరో యువకుడి ఆత్మహత్య