నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నదిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గురువారం రోజున.. నాగార్జునసాగర్ కొత్త వంతెనపై నుంచి ఓ కుటుంబం దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వారి కోసం గాలింపు చేపడుతున్న పోలీసులకు తిరుమలగిరి జమ్మన్నకోట తండా వద్ద బాలుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది. దంపతుల కోసం పోలీసులు కృష్ణా నదిలో గాలిస్తున్నారు.
మిస్సింగ్..
తిరుమలగిరి మండలం చింతలపాలెంకు చెందిన మండారి రామయ్య(36) సాగర్ జెన్కోలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతడికి భార్య నాగమణి, 10 ఏళ్లు కుమారుడు సాత్విక్ ఉన్నారు. గురువారం తెల్లవారుజాము నుంచి వారు కనిపించకుండా పోయారు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సూసైడ్ నోట్..
రామయ్య ఇంటికి చేరుకున్న పోలీసులు ఇళ్లంతా సోదాలు చేయగా.. వారికి ఆత్మహత్య లేఖ లభ్యమైంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం కారణంగా అందరు కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రాసి ఉంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
బాలుడి మృతదేహం లభ్యం..
చివరకు సాగర్-మాచర్లకు వెళ్లే నూతన వంతెన వద్ద రామయ్య ద్విచక్రవాహనం, చరవాణి దొరికినట్లు పోలీసులు తెలిపారు. వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే అనుమానంతో కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నటి నుంచి వెతకగా.. ఇవాళ తిరుమలగిరి జమ్మన్నకోట తండా వద్ద బాలుడు సాత్విక్ మృతదేహం లభ్యమైంది. అతడి తల్లిదండ్రుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
- ఇదీ చదవండి : Corona Cases: భారత్‌లో మరో 35 వేల కరోనా కేసులు