మృతదేహాన్ని తీసుకురావటానికి వెళ్తున్న ఓ ఆటో... కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని కోతుల చెరువు కట్ట సమీపంలో చోటుచేసుకుంది.
మృతదేహాన్ని తీసుకురావడానికి వెళ్తూ..
మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామానికి చెందిన దగ్గు భూమయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. భూమయ్య మరణించాడు.
మృతదేహాన్ని తీసుకురావడానికి భూమయ్య కొడుకు, గ్రామస్థులు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో రోడ్డుపై కుక్క అడ్డు రాగా... దాన్ని తప్పించబోయి అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో మెదక్ జిల్లా ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 5 బైక్‌లను దొంగిలించింది ఆ సంస్థ పాత ఉద్యోగే: ఏసీపీ