సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణం జరిగింది. మండల కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న ఓ యువతిపై బాల సైదులు అనే యువకుడు బ్లేడుతో దాడి చేసి గొంతు కోశాడు. ప్రేమిస్తున్నానని కొంతకాలంగా అమ్మాయిని వేధిస్తున్న యువకుడు... ఆమెకు మరొకరితో పెళ్లి కుదిరిందని తెలుసుకుని దాడి చేశాడు. ఒంటరిగా వెళ్తున్న ఆమెపై బాల సైదులు బ్లేడుతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. యువతి పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్‌లో మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నేను కాలువ దగ్గర బట్టలు ఉతకడానికి పోతుంటే... అక్కడ వాళ్ల చెల్లితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఇటు రా అన్నాడు. నేను వెళ్లలేదు. చాలా సార్లు పిలిచాడు. అప్పుడు వెళ్లాను. పైకి చూడమన్నాడు... బ్లేడుతో పీక కోసేశాడు. మూడు సార్లు కోశాడు. కొంతకాలంగా నేనంటే ఇష్టమని అంటున్నాడు. నేనేమో ఫ్రెండ్షిప్ అని చెప్పాను.
--బాధితురాలు
ఉన్మాది చేతిలో గాయపడ్డ కల్యాణికి మిర్యాలగూడ ఆస్పత్రిలో డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం బాధితురాలి బంధువులు కల్యాణిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఇదీ చూడండి: భోజనంలో మత్తు మందు కలిపి భర్తకు కరెంట్ షాక్!