సాధారణంగా కింది స్థాయి సిబ్బందిపైనే దాడి చేస్తే పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తుంటారు. అలాంటిది మాదాపూర్‌లో ఓ సీఐపై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదు? పెదవులు పగిలేలా కొట్టినా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు? ఇప్పుడిదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
సైబరాబాద్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి మాదాపూర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయం వద్ద రేంజ్ రోవర్ కారు అటువైపుగా వేగంగా దూసుకొస్తుండటంతో సిబ్బంది ఆపేందుకు యత్నించారు. కారు ఆపకుండా రివర్స్ వెళ్లడం గమనించి అప్రమత్తమై వాహనాలను అడ్డుగా పెట్టి ఆపేశారు. కారు లోపలున్న ఇద్దరు బ్రీత్ అనలైజర్ పరీక్షలకు నిరాకరించారు. పైగా.. మమ్మల్నే ఆపుతారా? మీరెంత మీ చదువులెంత? ఒక్క ఫోన్ చేస్తే మీ బతుకులు బజారున పడతాయంటూ బెదిరించడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఆపై మరింత రెచ్చిపోయి సిబ్బందిపై దాడికి దిగారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తనపై దాడికి పాల్పడిన ఇద్దరిపై సదరు ఇన్‌స్పెక్టర్.. మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
ఉన్నతాధికారి బంధువు కావడంతోనే
సీఐపై దాడికి పాల్పడిన వారిలో ఒకరు సివిల్ కాంట్రాక్టర్ కాగా మరొకరు వైద్యుడు. వీరిలో ఒకరు పోలీస్ శాఖలో పనిచేసే సీనియర్ అధికారికి బంధువనే ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు నిందితులను కాపాడేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు కేసు నమోదయిందా లేదా? నిందితులను అరెస్ట్ చేశారా, లేదా? అనే విషయాలూ గోప్యంగా ఉంచుతున్నారు.