నిజామాబాద్ నగరపాలక సంస్థలోని ఓ కార్పొరేటర్ ఇంటిపై మేయర్ భర్త అనుచరులు దాడి చేశారు. ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ పరిధిలో శుక్రవారం మున్సిపాలిటీకి చెందిన చెత్త వాహనం ఇంద్రపూర్ రోడ్డులో ఓ టిప్పర్‌కు తగిలింది. దీంతో ఆ టిప్పర్ సంబంధీకులైన మేయర్ భర్త అనుచరులు మున్సిపల్ సిబ్బందితో గొడవకు దిగారు. ఫలితంగా మున్సిపల్ సిబ్బంది విషయాన్ని స్థానిక కార్పొరేటర్ సాయివర్ధన్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న కార్పొరేటర్ మేయర్ అనుచరులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో మేయర్ అనుచరుడు నరేశ్, కార్పొరేటర్ సాయి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఇరువురూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఫోన్‌లో మరోసారి గొడవపడగా.. నరేశ్ మరో నలుగురితో కలిసి కార్పొరేటర్ సాయి ఇంటిపై దాడి చేశాడు. ఈ క్రమంలో కార్పొరేటర్ సాయి తమ్ముడు కర్ణవర్ధన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేయర్ అనుచరులు ఐదుగురిపై ఐదో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే డివిజన్ నుంచి మేయర్ భర్తపై సాయివర్ధన్ భాజపా తరఫున పోటీ చేసి గెలిచారు.
ఇదీ చూడండి: Corona effect: కొడుకుపై కిరోసిన్ పోసి.. ఆ తరువాత తనపై పోసుకొని.!