మంచిర్యాల జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి 75 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనం, ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల్ డీసీపీ ఉదయ్ కుమార్ వెల్లడించారు.
రెండేళ్ల క్రితం మంచిర్యాలకు మకాం మార్చారు...
నిందితులు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్కు చెందిన వారిగా గుర్తించామన్నారు. జగదల్పూర్కు చెందిన సూరజ్, సత్యవతి దంపతులు ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవారని డీసీపీ ఉదయ్ కుమార్ తెలిపారు. రెండేళ్ల క్రితం మంచిర్యాలకు వచ్చినట్లు వెల్లడించారు.
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్:
సూరజ్ తమ్ముడు రాహుల్ శెట్టి కూడా వీరితో జతకలిసి చోరీలు చేసేవారని పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మందమర్రి, రామకృష్ణాపూర్, కాశిపేట, మంచిర్యాలలో 16 చోట్ల దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. వరుస ఘటనలపై అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రాహుల్ శెట్టి, సత్యవతిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన సూరజ్ కోసం గాలింపు ముమ్మరం చేశామని వెల్లడించారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన రామకృష్ణాపురం ఎస్సై రవి ప్రసాద్, సిబ్బందికి అధికారులు రివార్డులు అందజేశారు.