Job Fraud: సైబర్ నేరగాళ్ళు పంథాలు మార్చి మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా అలాంటి ముఠా హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న కాల్ సెంటర్ల పై.. పోలీసులు చేసిన దాడిలో నలుగురు నిందితులు పట్టుబడ్డారు. హైదరాబాద్ గాంధీనగర్ కు చెందిన ఓ యువతి.. తన రెజ్యూమ్ ను షైన్ డాట్ కామ్ లో అప్లోడ్ చేసింది. అనంతరం ఆమెకు యాక్సెంచర్ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఇస్తామని కాల్ వచ్చింది. ఉద్యోగం వచ్చినట్లు అపాంయింట్‌మెంట్ లెటర్ మెయిల్ చేశారు.
అయితే వివిధ రకాల ఫీజులతో యువతి నుంచి 1.73లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. అనంతరం వారు స్పందించలేదు. అపాయింట్ మెంట్ లెటర్ ను తనిఖీ చేయగా అది కూడా నకిలీదని తేలింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో కేసులో నల్లకుంటకు చెందిన ఓ వ్యక్తికి.. షెల్ పీఎల్సి ఇండియాలో సీనియర్ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపిక అయ్యారని.. సంవత్సరానికి 69 లక్షల వేతనం అంటూ మెయిల్ వచ్చింది. ఉద్యోగంలో చేరాలంటే వివిధ ఛార్జీల కింద అతని నుంచి 5.49లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం స్పందించకపోవడంతో... కంపెనీ పై ఆరా తీయగా.. ఆపాంయిట్ మెంట్ లెటర్ నకిలీదని తేలింది. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ లో నమోదైన ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి పోలీసులు.. దిల్లీ కేంద్రంగా ఈ నేరాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేక బృందం.. దిల్లీ వెళ్లింది. రాజౌరి గార్డెన్ లోని కాల్ సెంటర్, ఘజియాబాద్ లోని ఇందిరాపురం లో ఉన్న మరో కాల్ సెంటర్ పై... దాడులు నిర్వహించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేసిన రాహుల్ కుమార్... ప్రతీక్ మన్వార్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 చరవాణులు, 4 లాప్టాప్ లు , 5డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంటకు చెందిన వ్యక్తిని మోసం చేసిన నితీష్ కుమార్, కరణ్ కోహ్లీ లను అరెస్టు చేసి... వారి నుంచి 8చరవాణులు, 5కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, సిమ్ కార్డులు, రిజిస్టర్లు, 4డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
వీరంతా ఇంటర్ వరకు మాత్రమే చదివినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉద్యోగ వెబ్ సైట్‌ల నుంచి వివరాలు తీసుకుని... ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉద్యోగం వస్తే ఆయా సంస్థలు మనకు వేతనం ఇవ్వాని కానీ.. మనం డబ్బులు చెల్లించకూడాదని పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైన ఇలా డబ్బు కట్టమని చెబితే అది మోసమని గ్రహించాలని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: