ఏపీలోని అరకు సమీపంలో డుముకు వద్ద జరిగిన బస్సు ప్రమాదం మృతదేహాలు హైదరాబాద్ షేక్ పేటకు చేరుకున్నాయి. నాలుగు మృతదేహాలతో పాటు... 16 మంది క్షతగాత్రులను అంబులెన్సుల్లో హైదరాబాద్ కు తరలించారు. మరో ఐదుగురికి విశాఖపట్నంలో కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్నవారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని బాధితుల కుటుంబసభ్యులు చెబుతున్నారు.
మృతదేహాలు, క్షతగాత్రులు షేక్‌పేటకు చేరుకోవడంతో షేక్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ప్రమాదం జరిగిన విషయం తెలిసినప్పటి నుంచి షేక్‌పేటలోని సత్యనారాయణ ఇంటి వద్ద ఉంటున్నారు. మృతదేహాలు సత్యనారాయణ నివాసానికి చేరుకోవడంతో... బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో సరైన చికిత్స అందించడంలేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నవారిని హైదరాబాద్‌కు తరలిస్తే... సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటామని అంటున్నారు.
హైదరాబాద్ షేక్‌పేటలోని ఓల్డ్ విలేజ్‌కి చెందిన సత్యనారాయణ కుటుంబం... బంధువులతో కలిసి ఈనెల 10న ఉదయం విజయవాడ, సింహాచలం, అరకు, తదితర ప్రాంతాల పర్యటనకు వెళ్లింది. శుక్రవారం అరకు సమీపంలో వీరి బస్సు లోయలో పడటంతో.. సత్యనారాయణ సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలైన ఏడుగురికి విశాఖలోని కేజీహెచ్‌లో వివిధ రకాల శస్త్రచికిత్సలు చేశారు. స్వల్ప గాయాలైన మరో 16 మందికి చికిత్స అందించారు.
హైదరాబాద్‌లోని సత్యనారాయణ నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రులు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
- ఇదీ చూడండి : ఏపీ: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం