హైదరాబాద్ షేక్‌పేటలోని ఓల్డ్ విలేజ్‌కి చెందిన సత్యనారాయణ కుటుంబం.. బంధువులతో కలిసి ఈనెల 10న ఉదయం విజయవాడ, సింహాచలం, అరకు, తదితర ప్రాంతాల పర్యటనకు వెళ్లింది. శుక్రవారం అరకు సమీపంలో వీరి బస్సు లోయలో పడటంతో.. సత్యనారాయణ సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలైన ఏడుగురికి విశాఖలోని కేజీహెచ్‌లో వివిధ రకాల శస్త్రచికిత్సలు చేశారు. స్వల్ప గాయాలైన మరో 16 మందికి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరామర్శించి ధైర్యం చెప్పారు.
విశాఖ వెళ్లిన షేక్‌పేట తహసీల్దారు
బాధితులకు భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ షేక్‌పేట తహసీల్దారును ప్రభుత్వం విశాఖకు పంపింది. వారికి అందుతున్న వైద్యసేవలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నాలుగు మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్న వారిని... ప్రత్యేక ఏర్పాట్లతో స్వస్థలానికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు.
మృతుల ఇంటి వద్ద విషాదఛాయలు
హైదరాబాద్‌లోని బాధితుల నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యనారాయణను కడసారి చూసేందుకు బంధువులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇప్పటికే కొందరు కుటుంబ సభ్యులు విశాఖపట్టణంలోని ఆస్పత్రికి వెళ్లారు.
ఇదీ చూడండి: క్రైం కహానీ: ప్రేమించి పెళ్లాడింది... ప్రియుడితో కలిసి చంపేసింది!