18 months child died: తండ్రి నడిపే కారే.. తన కూతురిపాలిట యమపాశంగా మారింది. బుడిబుడి అడుగులు వెస్తున్న ఆ చిన్నారి కాళ్లు కందకుండా చూసుకుంటున్న ఆ నాన్న కారే.. తన పాలుగారే బుజ్జాయిని నుజ్జునుజ్జుచేసింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న పాపాయి ప్రాణాలు పోడానికి.. యాదృశ్చికంగా ఆ తండ్రే కారణమైన విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరులో చోటుచేసుకుంది.
అల్లారుముద్దుగా చూసుకుంటున్న పాపను అప్పటివరకు ఆడించిన తండ్రి.. పని మీద బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కారులో వెళ్ధామని.. వెనక్కి తీస్తున్నాడు. అదే సమయంలో నాన్న కోసం.. 18 నెలల షణ్ముక బుడిబుడి అడుగులు వేసుకుంటూ అక్కడికి వచ్చింది. షణ్ముక రావటాన్ని గమనించని తండ్రి.. కారును వెనెక్కి తీసే పనిలో నిమగ్నమయ్యాయి. కారుకున్న సైడ్ మిర్రర్లో బుజ్జాయి కనిపించకపోవటంతో.. ప్రమాదవశాత్తు షణ్ముక వాహనపు టైర్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
ప్రాణానికి ప్రాణమైన చిన్నారి తన వల్లే చనిపోయిందని తెలిసి తండ్రి గుండెలవిసేలా రోధించాడు. అప్పటివరకు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండి.. ఆ క్షణమే తన కూతురిని చూసుకోకపోవటం వల్ల ఇలా జరిగిందని ఇటు తల్లి హృదయం ముక్కలైంది. ఎంతో అపురూపంగా చూసుకుంటున్న తమ గారాలపట్టి విగతజీవిగా మారటాన్ని చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇవీ చదవండి: రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు