మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా దాదాపు 1200 మంది చనిపోతున్నారు. పదివేలమంది చిన్నా పెద్దా గాయాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. పోలీసులు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆ సంఖ్య పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో ఎంతమంది ఏ రీతిలో చనిపోయారన్న దానిపై సైబరాబాద్ పోలీసులు విశ్లేషణ చేశారు. ద్విచక్ర వాహనదారులు మినహాయించి కారు, ఇతర ప్రమాదాల వల్ల ఎంతమంది చనిపోయారన్న దానిపై లెక్కలు తీశారు. మొదటి ఆరు నెలల్లో కమిషనరేట్ పరిధిలో ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్ల 61 మంది చనిపోయారు. ఇదే నిర్లక్ష్యంతో 79 మంది పాదచారులను వాహనదారులు బలి తీసుకున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్లో రోడ్డు దాటాలంటే.. దడదడ
కార్లు ఇతర వాహనాల వల్ల 1450 ప్రమాదాలు జరగ్గా అందులో 282 మంది ప్రాణాలు కోల్పోయారు. 1363 మంది గాయపడ్డారని గుర్తించారు. పోలీసులు సంబంధిత ప్రాంతాల్లో పరిశీలిస్తే చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే 100 మంది వరకు బతికేవారని పోలీసులు తేల్చారు. కొత్తగా వస్తున్న దాదాపు అన్ని వాహనాలకు ఎయిర్ బ్యాగ్ సిస్టం (బెలూన్ వ్యవస్థ) అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థ చక్కగా పని చేయాలంటే ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందే. కానీ గత ఆరునెలల్లో వాహనం ముందుభాగంలో గుద్దుకుని చనిపోయిన వారి సంఖ్య అధికంగానే ఉంది.
యువతే అధికం
రోడ్డు ప్రమాద మృతుల్లో యువతే అధికంగా ఉంటున్నారు. 25-35 ఏళ్ల లోపు వారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. వీరిది మొత్తం మృతుల్లో 28.7శాతం. వీరి తర్వాత అత్యధికంగా మరణిస్తున్న వారు 35-45 ఏళ్లలోపు నడి వయస్కులు వీరిది 24.49శాతం.
అడుగు ముందుకు పడటం లేదు..
తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లో 'యాక్టివ్ బ్లీడ్ కంట్రోల్ (ఏబీసీ)' పేరిట 108 సంస్థ చేసిన ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. హైదరాబాద్ శివార్లలో ప్రమాదాలు జరిగే అవకాశాలున్న ప్రాంతాల్లో సేవాభావం ఉన్న యువకులు, ఆటో డ్రైవర్లు తదితరులను గుర్తించి, వారికి అత్యవసర ప్రాథమిక వైద్యంలో ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. వైద్య కిట్లనూ అందజేసింది. 108కి ప్రమాద సమాచారం రాగానే ఆ ప్రాంతానికి వాహనం పంపడంతోపాటు ఆ పరిసరాల్లో సుశిక్షితులైన ఔత్సాహికులకూ సమాచారం వెళుతుంది. వారు తక్షణం అక్కడికి చేరుకుని బాధితులకు వైద్య సేవలు అందించడం ద్వారా ప్రాణాలకు ముప్పు తప్పుతోంది. కొన్ని సందర్భాల్లో వైద్య కిట్లను డ్రోన్ల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు పంపుతున్నారు. ఈ ప్రయోగాన్ని మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినా అడుగు ముందుకు పడలేదు.
వేగాన్ని నిరోధిస్తేనే ఫలితం!
మహానగరంలో రోజూ 60 లక్షల వాహనాలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. వాహన రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన రోడ్లపై వేగాన్ని పోలీసులు నియంత్రించారు. కొన్ని రోడ్లపై 40 కిలోమీటర్లు, మరికొన్ని ప్రధాన రోడ్ల మీద 60 కి.మీ మించి వెళ్లడానికి వీలులేదు. కానీ చాలామంది వాహనదారులు ఈ నిబంధనలను అసలు పట్టించుకోవడం లేదు. చలానాలు విధిస్తున్నా కూడా ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఇక నుంచి అతి వేగంగా విషయంలో కఠినంగా వ్యహరించాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: రోడ్డెక్కని ప్రయాణికుల భద్రత