సుదీర్ఘ చరిత్ర కలిగిన ఎగ్జిబిషన్ సొసైటీలో అవినీతి ఆరోపణలపై అనిశా రంగంలోకి దిగింది. నాంపల్లిలోని సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. దుకాణాల కేటాయింపు, నిధుల గోల్‌మాల్ నేపథ్యంలో అనిశా అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ బృందం వాటిని పరిశీలిస్తోంది.
ఏటా జనవరిలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే నుమాయిష్ దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన వారు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఇది ఏర్పాటై 80 ఏళ్లు పూర్తియింది. 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పట్టభద్రులు కొందరు యువకులు వెనుకబడిన తెలంగాణలో విద్యావ్యాప్తి కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ప్రస్తుత పబ్లిక్ గార్డెన్స్‌లోని కొంత స్థలంలో నుమాయిష్ ఏ ముల్క్ పేరిట వంద స్టాళ్లతో ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
ప్రతి సంవత్సరం నెల రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్‌తో వచ్చిన ఆదాయంతో వెనకుబడిన ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి ఖర్చు చేస్తూ వచ్చారు. ప్రజాధరణ లభించడంతో పబ్లిక్ గార్డెన్స్ నుంచి ప్రస్తుత నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలోకి మార్చారు. విశేష ప్రజాధరణ లభించడంతో వంద స్టాళ్ల నుంచి రెండున్నర వేల స్టాళ్ల వరకు విస్తరించారు. ఆదాయం ఏటా పెరుగుతూ రావడంతో 46 రోజుల పాట్టు ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ మైదానం విస్తరించి ఉంది.
ఇటీవల కాలంలో సొసైటీలో అక్రమాలపై పలు ఆరోపణలు వస్తున్నాయి. స్టాళ్ల కేటాయింపులో పెద్ద ఎత్తున అక్రమాలు, నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి ఏసీబీకి ఫిర్యాదులు రావడంతో... ఏసీబీలోని సీఐయూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన సోదాలు శనివారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. సోదాల్లో సొసైటీ కార్యాలయం నుంచి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో అనిశా తనిఖీలపై.. కార్యదర్శి స్పందించారు. తమ సొసైటీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. సొసైటీ కార్యకలాపాలు పారదర్శకంగా జరుగుతున్నాయని.. తొలిసారి అనిశా సోదాలు జరిగినట్లు చెప్పారు. రికార్డులు అనిశా అధికారులకు చూపించినట్లు తెలిపారు. ఖాతాలన్నీ ఏటా ఆడిట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సొసైటీ సమావేశాలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎన్నడూ హాజరుకాలేదని కార్యదర్శి వెల్లడించారు. అవినీతి, నిధుల గోల్‌మాల్ ఆరోపణలపై ఏసీబీ అధికారుల సోదాలు పూర్తయితే మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇదీచూడండి: అటవీ అధికారులపై పెట్రోల్ పోసిన చెంచు రైతులు