లంచం తీసుకుంటూ సోమవారం పట్టుబడిన సంగారెడ్డి జిల్లా భూ రికార్డులు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉప్పల్లోని ఆదర్శ్ నగర్లో అతనికి చెందిన రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు.. రూ.1.03 కోట్ల నగదు, 314.770 గ్రాముల బంగారు ఆభరణాలు, 95.55 లక్షల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ చందానగర్కి చెందిన ఓ వ్యక్తికి భూ సర్వే చేసి డాక్యుమెంట్లు అందించేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ మధుసూదన్ ఆదేశాలతో జూనియర్ అసిస్టెంట్ ఆసిఫ్ రూ.10 వేలు తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అనంతరం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో మధుసూదన్ ఇళ్లలో సోదాలు చేయగా ఉహించని మొత్తంలో నగదు, అభరణాలు బయటపడ్డాయి. అనిశా అధికారులు అతనిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేయనున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు మదుసూదన్ను అవినీతి నిరోధక శాఖ కస్టడీలోకి తీసుకొనే అవకాశం ఉంది.
ఇదీచూడండి: Bribe: అనిశా వలలో భూకొలతలశాఖ ఏడీ, జూనియర్ సహాయకుడు