ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ అబిడ్స్ డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ మహమ్మద్ ఆసిఫ్, జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అష్వక్లు పనిచేస్తున్నారు. రంజయ్సింగ్ అనే వ్యక్తికి సంబంధించిన కార్యాలయంలో తనిఖీల సమయంలో చూసీచూడనట్లుగా వ్యవహరించేందుకు, ఎలాంటి జరిమానాలు విధించకుండా ఉండేందుకు రూ.40 వేలు లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని రంజయ్సింగ్ అనిశా అధికారులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన అధికారులు అబిడ్స్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా మహమ్మద్ ఆసిఫ్, మహమ్మద్ అష్వక్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదును సీజ్ చేసిన అనిశా అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చూడండి: అటవీ ప్రాంతంలో కారు దగ్ధం.. మిస్టరీ కేసుగా నమోదు!