A Youth Committed Suicide in Nalgonda District: బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుడికి నష్టపరిహారం రాకపోవటంతో బాలస్వామి అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలస్వామి కుటుంబానికి న్యాయం చేయాలని భువనగిరి ఏరియా హాస్పిటల్ ముందు రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ధర్నాకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాం సుందర్రావు వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.
ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకి దిగటంతో ఇరువైపులా వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. బాధితుల, ధర్నా చేస్తున్న వారితో భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి మాట్లాడారు. స్థానిక పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. భువనగిరి మండలం బీఎన్. తిమ్మాపురం బస్వాపూర్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతోంది. గ్రామంలోని 18 ఏళ్లు నిండిన యువతి యువకులకు నష్టపరిహారంగా రూ. 7 లక్షల 61 వేలు అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.
కాగా బస్వాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుడు బీఎన్. తిమ్మపురం వాసులు ప్రాజెక్టుపై గత 27 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో బాలస్వామి కూడా పాల్గొన్నాడు. ఇటీవల మృతుని తండ్రికి, సోదరుడికి పరిహారం అందింది కానీ జాబితాలో బాలస్వామి పేరు లేదు. అర్హత ఉన్నా కూడా తనకు పరిహారం చెల్లించటం లేదని మనస్తాపంతో బాలస్వామి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చదవండి: