స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఆ యువతిని ఓ ఆగంతుకుడు ద్విచక్ర వాహనంపై అనుసరించాడు. ఆమెకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇంట్లో వాళ్లకి చూపుతానంటూ బెదిరించాడు. తానేమీ తప్పు చేయలేదని ఆమె ధైర్యంగా బదులివ్వడంతో.. అతను ఖంగుతిన్నాడు. ఒక్కసారిగా మాట మార్చాడు. ఎస్సై పిలుస్తున్నారు.. స్టేషన్కు రావాలన్నాడు. ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె అతని బండి ఎక్కింది. కొత్త మామిడిపాలెం రోడ్డులోకి తీసుకెళ్లిన అనంతరం ఆమెను బెదిరించాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత గది వద్ద వదిలేశాడు. ఈ విషయాన్ని తనతో పాటు ఉండే స్నేహితులకు ఆ యువతి చెప్పి కన్నీటి పర్యంతమైంది. వాళ్లు ఇచ్చిన ధైర్యంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఏపీలోని ఒంగోలులో జరిగింది.
స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన యువకుడి ఉదంతంపై బాధితురాలు గురువారం రాత్రి దిశ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గతంలోనూ ఈ తరహా ఇంకేమైనా నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: Super spreaders: తొలిరోజే పక్కదారి పట్టిన టీకా టోకెన్లు