సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరస్వతి అనే యువతి మృతదేహం లభ్యమైంది. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన యువతి శవాన్ని పోలీసులు గుర్తించారు. సరస్వతిని చున్నీతో గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. క్లూస్ టీం ఘటనా స్థలికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. నిన్న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సరస్వతి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
సరస్వతి బోయిన్పల్లిలోని ఓ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఓ వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పారు. ప్రేమ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని ఆమె ఆ వ్యక్తిని కోరాగా అతడు నిరాకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. బీహెచ్ఈఎల్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన వీరు తరచుగా కలుస్తూ ఉండేవారన్నారు. పెళ్లి విషయంలో ఘర్షణ చోటుచేసుకోవటంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని.. తన బిడ్డను చంపిన వారిపై కఠన చర్యలు తీసుకోవాలని సరస్వతి తల్లి డిమాండ్ చేస్తున్నారు.
సోమవారం ఉదయం 10 గంటలకు నా కూతురు బయటకు వెళ్లింది. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు వచ్చి చెబితే నా కూతురు చనిపోయినట్లు తెలిసింది. మాకు న్యాయం చేయాలి.
-లక్ష్మి, మృతురాలి తల్లి
సరస్వతి అనే అమ్మాయి మిస్ అయినట్లు కేసు నమోదు చేశాం. బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ వెనకాల రైల్వే ట్రాక్ పక్కన సరస్వతి మృతదేహాన్ని గుర్తించాం. ఈ అమ్మాయి దీపక్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. అతనిపై మృతురాలి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేస్తున్నాం.
-గంగాధర్, పోలీసు అధికారి
ఇదీ చదవండి: women suicide: ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య.. అదే కారణమా.!