Suicide Selfie Video: ఓ కార్మికుడు మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ బలవన్మరణానికి యత్నించాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెరిగూడెంకు చెందిన సాంబరాజు, అంజయ్య, ప్రభాకర్ గ్రామంలోని బోడగుట్టపై బండలు కొడుతూ జీవిస్తుంటారు. ఐతే వీరు బండలు కొట్టేందుకు జిలిటెన్‌స్టిక్స్, డిటోనేటర్లు వినియోగిస్తున్నారని పోలీసులకు సోమవారం సమాచారం అందిది.
దీంతో ఐనవోలు ఎస్సై వెంకన్న వడ్డెరిగూడెంలో సోదాలు జరిపి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిపై కేసు కూడా నమోదు చేశారు. మరుసటి రోజు కంప్రెషర్ ట్రాక్టర్లను స్టేషన్కు తీసుకురావాలని ఎస్సై సూచించారు. మరోవైపు నిన్న ఈఎమ్ఐ కట్టలేదని సాంబరాజుకు చెందిన ట్రాక్టర్ను ఫైనాన్స్ కంపెనీ వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ వైపు ట్రాక్టర్ పోవడం.. మరో వైపు కేసు నమోదు కావడం వల్ల తాను ఎలా బతికేదంటూ సాంబరాజు ఆందోళనకు గురయ్యాడు.
ఈ క్రమంలో బోడగుట్టకు వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకుంటూ సాంబరాజు పురుగుల మందు తాగాడు. తాను పురుగుల మందు తాగానని స్నేహితులు చెప్పడంతో హుటాహుటిన వారు అక్కడికి చేరుకొని అతడిని ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాంబరాజుకు భార్య ఇద్దరు కుమారులు, ఒక కుతూరు ఉన్నారు. ఈ విషయంపై ఎస్సై వెంకన్నను వివరణ కొరగా లైసెన్స్ లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారని.. మరోసారి వాటిని వాడవద్దని చెప్పామని తెలిపారు. బాధితుడి సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.