జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీ క్వార్టర్ 658లో సింగరేణి ఉద్యోగి నాగభూషణం నివాసం ఉంటూ భూపాలపల్లి ఒకటో గనిలో ట్రామర్‌గా పనిచేసేవారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన భార్య 2019లో మృతి చెందగా... గతేడాది రెండో వివాహం చేసుకున్నారు. ఫలితంగా మొదటి భార్య పిల్లలు తండ్రిపై ద్వేషాన్ని పెంచుకున్నారు.
రెండో వివాహం
ఆరు నెలల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. నాగభూషణం ఆయన రెండో భార్య బంధవుల ఇంట్లో జరిగిన ఓ వేడుకకు వెళ్లి... ఆదివారం భూపాలపల్లికి వచ్చినట్లు పేర్కొన్నారు. విధులకు వెళ్లి ఇంటికి వచ్చిన సమయంలోనే ఆయన కుమారుడు జగదీశ్, రెండో కూతురు మహేశ్వరి వచ్చారని వెల్లడించారు. రాత్రి ఏం జరిగిందో కానీ తండ్రిని అతి కిరాతంగా కత్తితో పొడిచి చంపినట్లు వివరించారు.
ఫోన్ కాల్తో విషయం వెలుగులోకి..
తండ్రిని హత్య చేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారని... అనంతరం జగదీశ్ తన బావకు ఫోన్ చేసి విషయం చెప్పారని పోలీసులు తెలిపారు. ఆయన పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలికి వెళ్లినట్లు పేర్కొన్నారు. హత్యకు గురైన నాగభూషణం మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. నిందితుని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: robbery: జ్యువెలరీ షాపులో చోరీ... ఏం ఎత్తుకుపోయారంటే..!