remand prisoner died: సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి.. మెజిస్టీరియల్ విచారణ - విశాఖపట్నం జిల్లా
జైల్లో ఉంటున్న రిమాండ్ ఖైదీ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఎలమంచిలిలో జరిగింది. కారాగారంలోనే ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుడు నాటుసారా తెచ్చుకుంటుండగా పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీలోని విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి సబ్ జైల్లో ఓ రిమాండ్ ఖైదీ మృతి చెందాడు. ఇటీవల నాటుసారా కేసులో అరెస్టైన సూరంపూడి శివ (25) అనే వ్యక్తిని.. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎలమంచిలి సబ్ జైల్‌కు తరలించారు. గత శుక్రవారం నుంచి శివ సబ్ జైల్లో ఉంటున్నాడు. ఈరోజు ఉదయం ఫిట్స్ రావడంతో జైలు సిబ్బంది అతడిని వెంటనే ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు.
కొక్కిరాపల్లి గ్రామానికి చెందిన శివ.. నాటుసారా తాగడానికి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో.. సారా తెచ్చుకుంటూ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. రిమాండ్‌లో ఉంటుండగా ఫిట్స్ రావడంతో చనిపోయాడని ఎలమంచిలి పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. శివ మృతదేహానికి వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు ఈ మృతిపై మెజిస్టీరియల్ విచారణ జరిపించారు.
ఆయన రెండు గంటల పాటు ఇక్కడ ఉండి సమగ్ర వివరాలు సేకరించారు. రిమాండ్ ఖైదీ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ వెంకటరావు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చదవండి: HRC: 'పోలీసులు రోజూ వేధిస్తున్నారు.. మమ్మల్ని కాపాడండి'