హైదరాబాద్ ఎల్బీనగర్(LB NAGAR)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి(MOTHER AND INFANT DIED IN PRIVATE HOSPITAL)లో దారుణం జరిగింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ.. ప్రసవానంతరం విగతజీవిగా మారింది. తనతో పాటే అప్పుడే పుట్టిన బాబు కూడా మృతి చెందాడు. ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
నార్మల్ డెలివరీ చేస్తామన్నారు.. తరువాత
వనస్థలిపురం చింతలకుంటకు చెందిన ప్రతిభ(28) నిండు గర్భిణీ. ప్రసవ సమయం దగ్గర పడటంతో శుక్రవారం సాయంత్రం.. ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శనివారం రాత్రి నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన వైద్యులు.. కాసేపటికి ఆపరేషన్ చేశారు. అనంతరం తల్లి మృతి చెందిందని.. అప్పుడే పుట్టిన పసిబాబు మృతి చెందాడని వైద్యులు.. మృతురాలి కుటుంబీకులకు తెలిపారు.
డాక్టర్ తనతో కఠినంగా ప్రవర్తించిందని నా భార్య నాతో చెప్పింది. 3 గంటల్లో నార్మల్ డెలివరీ చేస్తామని అన్నారు. కానీ తర్వాత ఆపరేషన్ అని చెప్పారు. మృతదేహాలను అప్పగించి నా భార్య, బిడ్డను నాకు కాకుండా చేశారు. వారి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. -విజయ్, మృతురాలి భర్త
బంధువుల ఆందోళన
ఘటనతో మృతురాలి బంధువులు.. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డ మృతి చెందారని.. ఆపరేషన్ సమయంలో అనస్తీషియా అధిక మోతాదులో ఇచ్చారని ఆరోపించారు. వైద్యురాలిని కఠినంగా శిక్షించాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయ్‌తో ప్రతిభకు గతేడాది వివాహం జరిగింది. పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న అతనికి.. భార్య, బిడ్డ విగతజీవులుగా మారడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకూ బాగానే ఉన్న ప్రతిభ.. సర్జరీ తర్వాత విగత జీవిగా మారడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Flood Effect: వాగులో కిలోమీటర్ దూరం కొట్టుకుపోయారు.. ప్రాణాలతో బయటపడ్డారు