దారితప్పి... కన్న తల్లితోనే అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడిని క్షణికావేశంలో చంపేసింది ఓ తల్లి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నాగమ్మకు ఇద్దరు సంతానం. కుమార్తెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపించగా... గ్రామంలోనే కూలీ చేసుకుంటూ కుమారుడితో కలిసి జీవిస్తోంది. తాగుడుకు బానిసైన శివ.. కన్నతల్లితోనే అసభ్యంగా ప్రవర్తించేవాడు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగ్గా... బంధువులు వచ్చి శివకు దేహశుద్ధి చేశారు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. వారం క్రితం తప్పతాగి వచ్చిన శివ.... కన్నతల్లి నాగమ్మను చెరబట్టబోయాడు.
ఎంత వారించినా వినకపోవడంతో... మత్తులో ఉన్న కుమారుడిని నాగమ్మ కత్తితో పొడిచింది. శివ తిరగబడే ప్రయత్నం చేయగా... తాడును గొంతుకు బిగించి ఊపిరాడకుండా చేసింది. తల్లి బుచ్చమ్మ సాయంతో కుమారుడు శివ శవాన్ని ఇంటి ముందు ఇసుక కుప్పలో పాతిపెట్టారు. క్షణికావేశంలో కుమారుడిని చంపి, భయంతో శవాన్ని దాచింది కానీ... నాగమ్మను భయం వెంటాడుతూనే ఉంది. తీవ్ర ఆందోళనకు గురైంది. చివరికి సర్పంచి వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.