కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మల్లాపూర్ శివారులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి కొందరు మొరం రవాణాను చేస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాటలో ఓ మహిళ కిందపడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహం చెందిన గ్రామస్థులు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు.
జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతితో అధికారులు అక్కడి నుంచి మొరాన్ని తరలిస్తున్నామని ట్రాక్టర్ డ్రైవర్ తెలిపారు. అయితే మొరం తీయడం వల్ల లోతులు పెరుగుతున్నాయని గ్రామస్థులు వాపోయారు. పొరపాటున మనుషులు, పశువులు అందులో పడటం వల్ల ప్రాణ నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మొరం రవాణాను స్థానికులు అడ్డుకున్నారు.
ఇదీ చదవండి: ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మానిక్కం ఠాగూర్